Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

"పరిమళ" మేడమ్‌కు నమస్కారం!






















"గురుబ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"


అనే శ్లోకం గురువు పవిత్రతను మనకు స్ఫురింపజేస్తుంది. పురాణాలు, వేదాలు, శాస్త్రాలన్నీ కూడా గురువుకి మూడో స్థానం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తల్లిదండ్రుల తర్వాత మనం స్మరించాల్సింది... గురువునే..!. గురుపూజోత్సవం సందర్భంగా పరిమళ మేడంతో నా అనుబంధాన్ని మీ ముందుకు తెచ్చే చిన్న ప్రయత్నం....

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని ఓ గ్రామంలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. మాస్టార్లంటే నాకుగౌరవం, భక్తి ఉండేది. వాళ్ళు ఎక్కడైనా వస్తున్నారంటేనే భయపడే దాన్ని. అయితే తరగతి గదిలో మాత్రం మొదటి వరుసలో కూర్చుని పాఠాలు వినేదాన్ని. ఇంకా చెప్పాలంటే.. అన్నీ సబ్జెక్టుల్లో రాణించిన నాకు గణితశాస్త్రం అంటేనే చాలా భయం.

ఐదో తరగతి వరకు దేవసేన, రెడ్డమ్మ టీచర్లు బోధించిన తీరు అధిక మార్కులు సంపాదించేలా చేసింది. హైస్కూలు మా ఊరిలో లేనందున అత్తూరు అనే గ్రామంలోని హైస్కూలులో ఆరో తరగతి వరకు చదివాను. ఈ గ్రామంలోని పాఠశాలలో ఒక్క సంవత్సరం మాత్రమే చదువుకున్నప్పటికీ ఆంగ్ల, గణిత, విజ్ఞాన శాస్త్రాలను బోధించిన దొరవేలు అయ్యవారు, దేవకి టీచర్‌ను ఎప్పటికీ మరిచిపోలేను.

ఇలా ఏడో తరగతి నుంచి కొన్ని అనివార్య కారణాల చేత మా కుటుంబం చెన్నై చేరింది. చెన్నైలోనూ తెలుగు మీడియం చేరాలనే ఉత్సుకతతో తెలుగు మీడియంలో చేరాను. కొత్త వాతావరణానికి చాలా రోజులైనా సద్దుకోలేని పరిస్థితిలో ఉన్న నన్ను 9వ తరగతి వరకు మా ఉపాధ్యాయులు ఎంతగానో నచ్చజెప్పి ఓ పరిణతికి తీసుకొచ్చారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలొచ్చాయ్.. ఇదే తరగతిలోకి ప్రవేశించేటప్పుడే గురువు అన్న మాటకు పూర్తి పరమార్థాన్ని గ్రహించాను. "పరిమళ" అనే టీచర్ టెన్త్ క్లాసులో మాకు "సోషియల్ సైన్స్" సబ్జెక్టును బోధించేవారు. ఆమె అంటే అందరికీ కాస్త భయమే. అయితే నాకు మాత్రం ఆమెను చూస్తే కొంత ధైర్యం వచ్చింది. అందరినీ చూసి భయపడే దానివి... ఆమెను చూస్తే ఎందుకే భయపడనంటున్నావని నా స్నేహితురాళ్ళు అడిగేవారు.

దీనికి కారణం ఆమె సహజత్వమే. విద్యార్థులను సమానంగా చూసే మనస్తత్వమే. ఎలాగంటారా? సాధారణంగా ఉపాధ్యాయులు మంచి మార్కులు సంపాదించే విద్యార్థులను ఇంకా బాగా చదివించి వందశాతం సాధించేలా శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయితే మా పరిమళా మేడం దీనికి విభిన్నం. చదివే పిల్లలు ఎలాగైనా చదువుతారు. వారికి ఆ జ్ఞానం దేవుడిచ్చారని అంటారు. అదే సమయంలో యావరేజ్ స్టూడెంట్స్‌, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యే విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.

ఎక్కువ మార్కులు కొట్టేసే విద్యార్థులను వెనుక బెంచిలో కూర్చోబెట్టి, యావరేజ్, ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్‌ని ముందు డెస్క్‌లో కూర్చో బెడతారు. అందులో యావరేజ్ స్టూడెంట్ని నేనూ ఒక్కదాన్ని... సోషియల్ సైన్స్‌లో నా ఇంట్రస్ట్ చూసి వందశాతం మార్కులు సాధించాలని పరీక్షా రాసే విధానం, ఎలా చదవాలి అనే ఇతరత్రా అంశాలను గురించి బోధించేవారు. థియరీ సబ్జెక్టుల్లో వందశాతం సంపాదించలేమని, అయినా కష్టపడు.. ఫలితముంటుందన్నారు.

ఎట్టకేలకు ఆమె కల నెరవేరింది. వందశాతం సంపాదించావా అని అడగకండీ... 85 శాతం మార్కులు సోషియల్ సైన్స్‌లో కొట్టేశా తెలుసా? కష్టపడి చదివినప్పటికీ నాకే మాత్రం గొప్పగా అనిపించలేదు. ఆమె బోధనకు తగ్గా ఫలితం వచ్చిందనిపించింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే... మ్యాథ్స్ అంటే చాలా భయపడేదాన్ని టెన్త్‌లో 80 శాతం మార్కులు సంపాదించా.

దీనికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? మా పరిమళా మేడమే... ఎలా ఆమె సోషియల్ సైన్స్ టీచర్ కదా? అని మీరు అడిగే ప్రశ్న... నాకు వినిపిస్తోంది... గణితమంటే భయపడొద్దని తరగతిలో విన్న అంశాలకు పొందికగా పరిమళ మేడమ్ గారి భర్త ఆమెలాగానే టిప్స్ ఇచ్చేవారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన కూడా ఓ మ్యాథ్స్ మాస్టారే... మా పరిమళా టీచర్ స్ఫూర్తితో ఇప్పటికీ M.A పూర్తి చేశాను. ఆమె ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారు. ఇక్కడుంటే ఆమె పాదాలను నమస్కరించుకునే దాన్ని....!

స్పందనలు

Re: "పరిమళ" మేడమ్‌కు నమస్కారం!
నిజం. కష్టపడు.. ఫలితం ఉంటుంది అని మీ టీచర్ చెప్పిన మాట ఎవ్వరికయినా శిరోధార్యమే. సాధారణ జీవితంలో మలుపు తిప్పిన ఆ టీచర్‌ను మరవనందుకు, గుర్తు తెచ్చుకున్నందుకు అభినందనలు.. బ్లాగ్ ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.. వీలైతే ఈ బ్లాగ్ పోస్ట్‌ను మీ టీచర్‌కు కూడా పంపండి. అమెరికాలో ఉన్నా అమె ఖచ్చితంగా సంతోషిస్తారు.
నిరాకరణ