ఆమె భక్తితో వాళ్ళకు ఉచిత సేవలు చేయసాగింది. ఆమె అద్భుత సౌందర్యానికి నారదుడు ముగ్ధుడయ్యాడు. నారాయణ జపం మానేసి, ఆమె లావణ్యం అతని మనసులో పీఠం వేసింది. బరువు మొయ్యలేక కృశించిన నారదుడిని చూసి పర్వతుడు ఏంటి మామా? ఏమిటి అలా అయిపోయావని ప్రశ్నించాడు.
(దీనికి ముందే నారదుడు, పర్వతుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేమిటంటే...? ఓసారి నారద, పర్వతులు సంచారానికి వెళ్ళినప్పుడు "మనిద్దరం ఒకరి మనసులో ఉండే అభిప్రాయాలు మరొకరికి చెప్పుకోవాలని..", "దాపరికం చేస్తే శాపం తప్పదని" పర్వతుడు... నారదుడుతో అంటాడు.)
పర్వతుని ప్రశ్నకు నారదుడు సిగ్గుపడి సుకుమారి విషయాన్ని చెప్పకుండా దాచేస్తాడు. దీంతో పర్వతుడు దివ్యదృష్టిలో నారదుని సంగతిని గ్రహించి అన్నమాట తప్పావని, రాజుగారి కూతురుమీద మనసు పడిన సంగతిని నాతో ఎందుకు చెప్పలేదని నారదుడిని ప్రశ్నిస్తాడు.
అంతేకాకుండా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నేనిప్పుడు నీకు శాపం ఇవ్వాలని చెబుతూ.... నీకు పెళ్ళి కాగానే మర్కట రూపం వచ్చుగాక అని మేనమామను శపిస్తాడు. ఈ శాపాన్ని విన్న నారదుడు నీవు దేవలోకానికి వెళ్ళకుందువుగాక అని మేనల్లుడికి ప్రతి శాపమిచ్చాడు. దీంతో పర్వతుడు అక్కడ నుంచి నిష్క్రమిస్తాడు.
తర్వాత నారదుడు మహారాజును అర్ధించి ఆయన కూతురు సుకుమారిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికూతురి మెడలో మంగళసూత్రం కట్టగానే పర్వతుని శాపంతో నారదుడికి కోతిరూపం వచ్చింది. కాని సుకుమారి మహాసాధ్వి కావడంతో భర్తను ఏవగించకుండా పూజించింది.
కొనాళ్లు గడిచాక, నారదుడికి పర్వతుడు కనిపించి మామా! నా శాపం మరలించవా అని నారదుడిని అర్ధించాడు. ముందు శపించిన వాడివి నువ్వే కాబట్టి మొదటగా నువ్వే నీ శాపాన్ని మరలించమంటాడు నారదుడు. సరేనని తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు పర్వతుడు.
నారదుడు కూడా పర్వతునికిచ్చిన శాపం నుంచి తప్పిస్తాడు. దీంతో ఇద్దరు కలిసి ఇంటికొచ్చారు. కోతిముఖం లేని నారదుణ్ణి చూసి తన భర్త కాదనుకున్న సుకుమారికి పర్వతుడు జరిగిన సంగతంతా చెబుతాడు. సుకుమారి ఆశ్చర్యపోయి, అరచేతుల్లో ముఖాన్ని దాచుకుని వ్రేళ్ల సందుల్లోంచి భర్తను సిగ్గుతో చూస్తుంది.
లోడ్ అవుతోంది...